నల్సార్ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థులపై చర్యలకు సిద్ధమైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేస్తూ.. ఈ విషయంలో బీసీఐ జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు. అనంతరం ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు బీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై చర్యలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిద్ధమైన వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకునేందుకు బీసీఐకి ఏం సంబంధమని ప్రశ్నించారు.
2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా చేర్చుకోవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిళ్లను బీసీఐ ఆదేశించింది. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీని కోరింది.

ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని, ఇందులో బీసీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజేఐ పేర్కొన్నారు.
విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని సీజేఐ స్పష్టం చేశారు. బీసీఐ అనవసరంగా జోక్యం చేసుకుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తమ ఆదేశాలను ఇప్పటికే ఉపసంహరించుకున్నామని బీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

అసలు వివాదం ఏంటి?

స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నల్సార్ విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సుమారు 450 మంది సంతకాలతో లేఖ రాశారు.పేపర్ లీక్‌ అంశంపై నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో సుప్రీంకోర్టు వైఖరిని విద్యార్థులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే సీజేఐని స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది.