ఇంటర్నెట్ డెస్క్: భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై డోభాల్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై డోభాల్ పలు కీలక వివరాలను వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకున్నామని తెలిపారు. పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఉగ్రవాద చర్యలకు భారత్ దీటుగా స్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి ఇచ్చామని డోభాల్ పేర్కొన్నారు. భారత్ సహనాన్ని బలహీనతగా భావించి పొరపాటు చేయొద్దని, అవసరమైతే ఎంతటి రిస్క్‌నైనా తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు కూడా తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించినట్లు సమాచారం. శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీతో పాటు డిస్కవరీ+ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.
కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతేడాది మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది. అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య 88 గంటల పాటు పరస్పర దాడులు జరిగాయి. మే 10న పాకిస్థాన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.