ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో తాజాగా ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై నమోదైన నేరపూరిత పరువు నష్టం కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో లఖ్నవూ మెజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేసింది.
సెక్షన్ 153ఏ కింద చర్యలు చేపట్టేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ముందస్తు అనుమతి తీసుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కారణంతోనే రాహుల్ గాంధీపై దాఖలైన కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన నృపేంద్ర పాండే.. సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను ఏసీజేఎమ్ తిరస్కరించారు.
దీనిపై పిటిషనర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. కేసును తిరిగి మెజిస్ట్రేట్‌కు బదిలీ చేశారు. అనంతరం లఖ్నవూ మెజిస్ట్రేట్ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసి, సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అవసరమైన ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో కేసును కొట్టివేసింది. అయితే స్వాతంత్ర్య సమరయోధుల గురించి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించాలని రాహుల్ గాంధీకి సూచించింది.