ఢిల్లీ, ఆగస్టు 14 (ప్రతి ఉదయం ప్రతినిధి): అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ కక్షసాధింపుతోనే కేసు నమోదు చేశారన్న ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది.
రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ వంటి అంశాలు పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏ ఒక్క బాధితుడు కూడా కోర్టును ఆశ్రయించని సమయంలో రాజకీయ ప్రత్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లకు చట్టబద్ధత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
న్యాయస్థానాలను రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై విచారణకు సుప్రీంకోర్టు ముగింపు పలికింది.