నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గుడివాడలో మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ టీమ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

గుడివాడ, ఆగస్టు 14 (ప్రతి ఉదయం ప్రతినిధి): మాదకద్రవ్యాల మహమ్మారిపై గుడివాడలో సమరశంఖం మోగింది. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్’ అంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినదించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ టీమ్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ పురవీధుల్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ముందుగా అవగాహన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్ ఒక మహమ్మారి అని, వాటికి బానిసలైతే కుటుంబాలతో పాటు యువత భవిష్యత్ కూడా నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌కు బానిసైన వారిని ఆదుకోవాలి

మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని శత్రువులుగా చూడకుండా.. వారికి అవగాహన కల్పించి మంచి మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు.
స్నేహితులు, పరిచయస్తుల్లో ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు తెలిస్తే వారి జీవితాన్ని కాపాడేందుకు ఈగల్ టీమ్‌కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
గుడివాడలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు చేస్తున్న పోరాటానికి విద్యార్థులు, యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. ‘నో డ్రగ్స్’ అనేది కేవలం నినాదం కాకుండా ప్రతి ఒక్కరి ప్రతిజ్ఞ కావాలని ఎమ్మెల్యే రాము సూచించారు.

యువకుడి ఘటనను గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచార సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు ‘దేవుడు పిలుస్తున్నాడు’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే రాము గుర్తుచేశారు. ఇలాంటి విషాద ఘటనలు మరెక్కడా చోటుచేసుకోకుండా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

‘ఐ లవ్ యూ గుడివాడ’ వద్ద వీడియోలు

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ సూచనలను వీడియో రూపంలో తెలియజేయాలని ఎమ్మెల్యే రాము కోరారు.
గుడివాడ కోసం ఏం చేయాలనుకుంటున్నారో ‘ఐ లవ్ యూ గుడివాడ’ సెల్ఫీ పాయింట్ వద్ద వీడియో తీసి సోషల్ మీడియాలో #AnuNenu #Gudivada హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ఈగల్ హెల్ప్‌లైన్ 1972 నంబర్‌ను పలికించారు.