శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. కనకదుర్గమ్మ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు లోకకల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రిపై త్రయాహ్నిక వరుణ యాగాలు ప్రారంభమయ్యాయి.

విజయవాడ, ఆగస్టు 14 (ప్రతి ఉదయం ప్రతినిధి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాస సందడి ప్రారంభమైంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

శ్రావణ మాసంలో భాగంగా ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఆ రోజు అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అలాగే ఈ నెల 27, 28, 29 తేదీల్లో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి. శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కుంకుమ పూజలను అర్చకులు నిర్వహించనున్నారు.

ఘనంగా వరుణ యాగం

మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. లోకకల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వేదపండితులు కృష్ణా నదిలోకి దిగి ప్రత్యేక వరుణ జపాలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలు నిర్వహించనున్నారు.

దుర్గాఘాట్, పాత యాగశాల వేదికలుగా మూడు రోజుల పాటు విశేష హోమాలు, జపాలు, ఘటాభిషేకాలు నిర్వహించనున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ఈ వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.