ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 14 (ప్రతి ఉదయం ప్రతినిధి): కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్‌కు స్వల్ప ఊరట లభించినట్లైంది.
ఈ కేసును జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నగదు రూపంలో సాయం చేస్తే అభ్యంతరం చెప్పే వారా? అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించేందుకు మీరెవరంటూ పిటిషనర్లను నిలదీసింది.
హైకోర్టు ఏం చెప్పింది?
గతేడాది టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం టీవీకే అధినేత విజయ్ మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ జీవో జారీ చేశారు.అయితే ఈ జీవోను జులై 27న హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 నిబంధనలను ఈ జీవో ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది.ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారని హైకోర్టు పేర్కొంది. వారి అవసరాలను పక్కనపెట్టి కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ముందుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది.
ప్రమాదకరమైన ఒరవడికి దారితీస్తుంది
రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం జీవో జారీ చేశామన్న ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం తన అధికారాలను రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వినియోగించాలని సూచించింది.అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రభుత్వ తప్పిదాలు ఉన్న సందర్భాలు ఉండొచ్చని.. అయితే అలాంటి ఘటనల్లో బాధితులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదని కోర్టు ప్రస్తావించింది.కరూర్ ఘటనలో కారుణ్య నియామకాలకు అనుమతిస్తే భవిష్యత్తులో ఇలాంటి నియామకాలకు దారితీసే ప్రమాదకరమైన ఒరవడికి నాంది పలికినట్లవుతుందని హైకోర్టు అప్పట్లో అభిప్రాయపడింది. తాజాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.