విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్యూ లైన్లలోకి వెళ్లే ముందే ప్రత్యేక కౌంటర్లలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

విజయవాడ, ఆగస్టు 13 (ప్రతి ఉదయం ప్రతినిధి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల భద్రత కోసం కొత్త నిబంధనలను అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

స్కానింగ్ పాయింట్ వద్ద కొత్త భద్రతా గేట్‌ను ఏర్పాటు చేశారు. స్కానింగ్ అనంతరం మొబైల్ ఫోన్లు ఆలయంలోకి వెళ్లకుండా భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు.

ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లు

కొత్త నిబంధనల ప్రకారం క్యూ లైన్లలోకి వెళ్లే ముందే భక్తులు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేకంగా మొబైల్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. హోంగార్డులు, అజైల్ సెక్యూరిటీ సిబ్బందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

దర్శన ఏర్పాట్లలో మార్పులు

భక్తుల రద్దీని నియంత్రించేందుకు దర్శన క్యూ లైన్లలో కూడా మార్పులు చేశారు. దర్శన టికెట్ల జారీ కౌంటర్ల స్థానాలను మార్చినట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే ఉచిత లడ్డూ ప్రసాదం కౌంటర్లను కూడా మార్పు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కొత్త భద్రతా నిబంధనలకు భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.