అమరావతి, ఆగస్టు 13 (ప్రతి ఉదయం ప్రతినిధి): అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
గురువారం రాయపూడి వద్ద నిర్మించిన నూతన భవన సముదాయాన్ని సీఆర్డీఏ సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) అప్పగించింది. అనంతరం సీఎం చంద్రబాబు భవన సముదాయాన్ని ప్రారంభించారు.
12 టవర్లలో 288 ఫ్లాట్లు
రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉండేలా మొత్తం 288 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది.అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించిన సీఆర్డీఏ.. టవర్ల మధ్య ప్రత్యేక ల్యాండ్స్‌కేప్, లాన్లను ఏర్పాటు చేసింది. నివాస సముదాయంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది.
భవనాలను పరిశీలించిన సీఎం
మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి సీఎం చంద్రబాబు నూతన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాలను పరిశీలించారు. భవనాల్లో కల్పించిన వసతులు, నిర్మాణ నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.భవన సముదాయాన్ని జీఏడీకి అప్పగించిన నేపథ్యంలో ఇకపై వీటి నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షించనుంది. ప్రభుత్వం నిర్ణయించే విధానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.