అమరావతి, ఆగస్టు 12 (ప్రతి ఉదయం ప్రతినిధి): అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. అమరావతి రహదారి అనుసంధానంలో కీలకంగా మారనున్న సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తోంది.
సీడ్ యాక్సిస్ రోడ్డును 9 లేన్ల రహదారిగా నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకు సెంట్రల్ బీఆర్‌టీఎస్‌తో పాటు ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు.
అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్లే N1 నుంచి N17 వరకు ఉన్న రహదారులను సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానం చేయనున్నారు. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ఈ రహదారి జాతీయ రహదారి-16తో అనుసంధానం కానుంది.
21.77 కిలోమీటర్ల పొడవు
సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని మూడు దశల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఫేజ్-1లో దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఫేజ్-2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు.
రెండు స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం
ఫేజ్-2లో భాగంగా రెండు కీలక స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఉండవల్లిలోని బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జి నిర్మించారు.
అలాగే కొండవీటి వాగు, గుంటూరు ఛానల్‌పై 280 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
ఇక ఫేజ్-3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతిలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.