గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ తేల్చింది. ఒకే జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేసినట్లు వెల్లడించింది. ఎంపికైన 165 మందిలో 160 మంది, ఎంపిక కాని 161 మందిలో 153 మంది జవాబు పత్రాల్లో మార్కులకు సంబంధించిన మార్పులు గుర్తించినట్లు నివేదికలో పేర్కొంది.

అమరావతి, ఆగస్టు 12 (ప్రతి ఉదయం ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న గ్రూప్-1 మూల్యాంకన అక్రమాలపై సిట్ హైకోర్టుకు తుది నివేదిక సమర్పించింది. గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఒకే జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేసినట్లు వెల్లడించింది.

డిజిటల్, హైలాండ్, విజయవాడలో మూడు దశల్లో మూల్యాంకనం జరిగినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 160 మంది జవాబు పత్రాల్లో మార్కులకు సంబంధించి మార్పులు జరిగినట్లు తెలిపింది. అలాగే ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ, రిట్ పిటిషనర్లు సమర్పించిన 405 జవాబు పత్రాల్లోనూ మార్పులు గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది.

వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ గుర్తింపు

చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైనట్లు సిట్ తెలిపింది. మొత్తం 61 స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది.

హైలాండ్ రిసార్ట్‌లో 84 రోజుల పాటు జవాబు పత్రాలు ఉన్నట్లు సిట్ నివేదికలో వెల్లడించింది. 452 మంది నిపుణులతో కూడిన ప్యానల్‌ను పక్కనపెట్టి.. 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు సిట్ పేర్కొంది.

మూడుసార్లు మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధం

మూడోసారి మూల్యాంకనం కోసం కొత్త OMR బార్‌కోడ్ షీట్లను ముద్రించినట్లు సిట్ గుర్తించింది. ఒకే జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేయడం APPSC నిబంధనలకు విరుద్ధమని తేల్చింది.

దాదాపు 173 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఏడు CFSL ల్యాబొరేటరీల ఫోరెన్సిక్ డేటాను పరిశీలించిన అనంతరం సిట్ తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను హైకోర్టుకు సమర్పించింది.