టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. మరోసారి చైర్మన్ పదవిని కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. 2027 ఫిబ్రవరి 20 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ముందుగానే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామా వార్తల నేపథ్యంలో టాటా సంస్థ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయాయి.

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ప్రతి ఉదయం ప్రతినిధి): టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఇకపై ఈ సంస్థ చైర్మన్ పదవిని మరోసారి చేపట్టేందుకు తాను ఆసక్తిగా లేనని స్పష్టం చేశారు. ఆగస్టు 18న టాటా సన్స్ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో.. కొద్ది రోజుల ముందే చంద్రశేఖరన్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టాటా గ్రూప్‌లో తన వృత్తి జీవితానికి 40 ఏళ్లు పూర్తయ్యాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఇంత ప్రతిష్ఠాత్మక సంస్థకు సేవలందించే అవకాశం లభించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది అపారమైన బాధ్యతతో కూడుకున్న పదవిగా అభివర్ణించారు.

టాటా సన్స్‌కు తదుపరి వారసుడిని త్వరగా ఎంపిక చేయాలని బోర్డును చంద్రశేఖరన్ కోరారు. ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకు ఉన్నప్పటికీ.. కొన్ని నెలల ముందుగానే రాజీనామా చేశారు. చంద్రశేఖరన్ రాజీనామా వార్తల నేపథ్యంలో టాటా సంస్థ షేర్లు దాదాపు 5 శాతం మేర పడిపోయాయి.

టీసీఎస్‌ నుంచి టాటా సన్స్ చైర్మన్‌గా..

ఎన్. చంద్రశేఖరన్ గతంలో టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.

అయితే చంద్రశేఖరన్‌ను మరోసారి టాటా సన్స్ చైర్మన్‌గా నియమించే అంశంపై టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

టాటా గ్రూప్‌లోని కీలక సంస్థలైన టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇండియన్ హోటల్స్ తదితర సంస్థలకు చంద్రశేఖరన్ ఇప్పటివరకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన రాజీనామాతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వంపై ఆసక్తి నెలకొంది.